శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీక కుల (వన)భోజనాలు

>> Saturday, November 11, 2017

కులభోజనాలు(వన భోజనాలు)
---------------------------
మా వాడ కూడలి కాడ
జనమంతా కూడితే
జాతరకు పోతున్నారనుకున్నా

గుంపుగా ఉన్నవారంతా
గ్రూపులు కడుతుంటే
ఊరు బాగు కోసం అనుకున్నా

జనం కూడింది
జాతర కోసం కాదట
అన్నంలో కులం మన్ను కలపడానికట

గ్రూపులు కడుతున్నది
ఊరి బాగు కోసం కాదట
వనంలో కులం కుంపటి రాజేయటానికట.

అందుకే కాబోలు....
మా ఊరి మామిడి వనం
కులభోజన జనంతో కలకలలాడుతున్నది.
చిగురులతో నన్నెప్పుడూ పలకరించే చెట్టు
కులచిచ్చుల కేంద్రమౌతున్నది.

నా ఊయలకు.....
కూసే కోయిలకు.....
ఆధారమై నిలిచే మావికొమ్మ
కులజెండా కర్రగా మారిపోతున్నది.

కోయిల కు...కూ...ల పాటలతో
సంగీత పాఠాలను నేర్పించే మావిడివనం
శృతితప్పి  కులస్వరాలను ఆలపిస్తున్నది.

నా ఇంటి తోరణానికి ......
ఊరి ఆవరణానికి .....
పచ్చని కారణమై నిలిచే మావిడాకు
వెచ్చని కులకుంపటిలో మాడిపోతున్నది.

మెదళ్ళకు ఎక్కిన కులం
మొదళ్ళ కాడ కుంపటి రాజేసింది
బతుకుల నిండా నిండిన వివక్ష
మెతుకులకూ అంటుకుంటోంది.

ఎవడి చెట్టు వాడిదే
ఎవడి గిన్నే వాడిదే....
ఎవడి విస్తరి వాడిదే
ఎవడి అస్తిత్వం వాడిదే

*నేటి వన భోజనాలు*
*కడుపు నింపుకోవడానికి కాదు*
*కులం మత్తు నింపుకోవడానికి!*

1 వ్యాఖ్యలు:

Anonymous November 11, 2017 at 5:23 PM  

చాలా బాగా చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP