శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కలియుగాంతం కాదు!

>> Friday, December 7, 2012

కలియుగాంతం కాదు!


మాయన్ క్యాలెండర్‌లో చెప్పినట్లు ఈ నెలలో యుగాంతం అయిపోతుందా? లేక హిందూ పురాణాలలో చెప్పిన మాదిరిగా మరో 4.25 లక్షల ఏళ్లు ఈ కలియుగమే కొనసాగుతుందా? ఈ విషయంపై బ్రహ్మం గారి కాలజ్ఞానం ఏం చెప్పింది? - ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో డాక్టర్ కోరాడ ప్రభాకర్ ఇంగ్లీషులో రాసిన పుస్తకమే - " 2012 ఈజ్ నాట్ ద ఎండ్, ప్రాఫసీస్ ఆఫ్ ఎ హిందూ సేజ్''. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, ఆయన చెప్పిన కాలజ్ఞానంతో పాటు హిందూ ధర్మానికి సంబంధించిన అనేక అంశాలను ప్రభాకర్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మన రాష్ట్రంలో విశేషంగా ప్రచారంలో ఉన్న బ్రహ్మం గారి కాలజ్ఞానం ఇంగ్లీషులో రావటం ఇదే తొలిసారి. ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం..

దాదాపు ఐదు వేల ఏళ్ల క్రితం వేదవ్యాసుడు కలియుగంలో మానవులు అర్థం చేసుకోవటానికి వీలుగా జ్ఞానాన్ని నాలుగు వేదాలుగా వర్గీకరించాడు. కలియుగంలో మానవులు అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి వాటికి ఈ వేదాలలో పరిష్కారమార్గాలు సూచించాడు. వేదవ్యాసుడు భారతాన్ని కూడా రాశాడు. భారతంలోని భగవద్గీతలో ఉపనిషత్తుల సారమంతా ఉంటుంది. వ్యాసుడు భారతంతో పాటు 18 పురాణాలను కూడా రాశాడు. వీటిలో భవిష్య పురాణం కూడా ఒకటి. దీనినే కల్కి పురాణం అని కూడా అంటారు. పురాణము అంటే చరిత్ర అని అర్థం.

జరగబోయేదాన్ని భవిష్యత్తు అంటారు. అందుకే వ్యాసుడు భవిష్య పురాణంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాడు. ఈ పురాణంలో క్రైస్తవ, ఇస్లాం మత వ్యవస్థాపకుల గురించి, వారి పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించాడు. ఆకాశం నుంచి గుర్రం మీద కత్తి పట్టుకొని కల్కి భూమిపైకి రావటంతో ఈ పురాణం పూర్తవుతుంది. కల్కిని విష్ణువు పదో అవతారంగా చెబుతారు. మానవులను ఇబ్బంది పెట్టేవారందరిని సంహరించి, వేద సూత్రాల ఆధారంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటమే కల్కి లక్ష్యం. ఈ క్రమంలో కల్కి అనేక మందితో యుద్ధాలు చేస్తాడు. బౌద్ధమతంపై విశ్వాసం లేని బౌద్ధులతో కూడా పోరాడతాడు. ఈ యుద్ధంలో అనేక వేల మంది భారతీయులు మరణిస్తారు. విజయం కల్కినే వరిస్తుంది. హిందు ధర్మ శాస్త్రాలలోని యుగ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. ఇది మరొక 4.27 లక్షల ఏళ్లు ఉంటుంది.

కలియుగం చివర్లో భారతీయులను రక్షించటానికి కల్కి మళ్లీ భూమిపైకి వస్తాడు. అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాను కల్కి అంశతో వీరభోగ వసంతరాయుల రూపంలో ఆకాశాన్ని చీల్చుకొని భూమిపైకి వస్తానని 350 ఏళ్ల క్రితం పేర్కొన్నాడు. అంటే కలియుగం అనేది ఐదు వేల ఏళ్ల తర్వాత అంతం అయిపోతుందా? లేకపోతే భూమిపై ఉన్న మంచి వ్యక్తుల కోసం మరి కొంత కాలం ఉంటుందా? అనే విషయాన్ని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పలేదు. అయితే మన పురాణాల ఆధారంగా చూస్తే- మానవుల పాపాలను భరించలేకపోతున్నానని భూదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకుంటుంది. అప్పుడు తాను ఊహించిన దానికన్నా ముందే భూమిపైకి వస్తానని.. కృతయుగ ధర్మాన్ని స్థాపిస్తానని భూదేవికి వరం ఇస్తాడు. కాని ఎంత త్వరగా వస్తాడనే విషయాన్ని మాత్రం వెల్లడించడు.

[andhrajyothy.com]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP